Thursday, December 15, 2011

విశ్వనాథవారి రామాయణకల్పవృక్షంలో...



3.తా మమకారమే యనుము తక్కిన ముగ్గురొకెత్తు వాడొకె
త్తోముని నాకు , వాని విడి యోర్వగఁజాలను, గోసలేంద్ర క
న్యామణి యోర్వ, దెవ్వరెటులైనను గైకయి యోర్వఁజాలదా
రాముడు లేని నాదు గృహరాజియు జీకటి కోణముల్ మునీ !”


 (బాలకాండ, అవతారఖండము)
తన యాగాన్ని సంరక్షించటానికి, రాముని తనతో పంపవలసినదిగా విశ్వామిత్రుడు అడిగినపుడు ఖిన్నుడైన దశరథుడు అంటున్న మాటలివి. “మునీ !నాది మమకారమే అనుకో, తక్కినముగ్గురూ (భరత, లక్ష్మణ,శత్రుఘ్నులు) ఒక ఎత్తయితే వాడొక్కడూ ఒక యెత్తునాకు. వాడిని విడచి ఉండలేను. కౌసల్య ఓర్చుకోలేదు.ఎవరి మాట ఎలా ఉన్నా అసలు కైకేయి ఓర్వలేదు. రాముడు లేని నా గృహ సముదాయమంతా చీకటికోణాలే అవుతాయి ”



రామునిపై కైకేయికెంతో ప్రేమాభిమానాలున్నా యనే సంగతి వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో గమనించగలుగుతాము. రామపట్టాభిషేక వార్తను మంథర తనకు చెప్పగానే కైకేయి సంతోషించి ఆమెకు ఒక బంగారు ఆభరణాన్నికానుకగా ఇచ్చింది. అంతటి సంతోషకరమైన వార్త తనకు మరొకటి లేదంది. “రామే వా భరతేవాహం విశేషం నోపలక్షయే” (రామభరతులయందు నాకెలాంటి ఎక్కువ, తక్కువలు లేవు)అంది.


కల్పవృక్షంలో బాలరాముడు కైకేయిని చూడగానే ఆమెదగ్గరకు ఉరుకుతాడు. తాను కైక దగ్గర ఉం ఇక ఎవరు పిలిచినా వారి దగ్గరకు వెళ్ళేవాడు కాదు. అంతేకాదు -


“కాళ్ళు వచ్చినదాదిగాఁగైక కొఱకుఁ
బరువు లెత్తును శ్రీరామభద్ర మూర్తి
నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొఱకు
నంగలార్చుచుఁజనుఁగేకయాత్మజాత ”


అని వారిద్దరి అనుబంధాన్ని చిత్రీకరించారు విశ్వనాథ. రాముడు విలువిద్య నేర్చే సమయంలోకూడా ఆమె స్వయంగా వచ్చి చూసేది. బాణాలను ఎలా సంధించాలో, లక్ష్యాలను ఎలా ఛేదించాలో చెప్పేది. ఆ విషయాల్లో కైకేయి మాటనే పాటించేవాడు రాముడు.నిర్దేశిత లక్ష్యం ఛేదింపబడగానే ఇద్దరూ హాయిగా నవ్వుకొనేవారు.



No comments:

Post a Comment