6. “ప్రభుమేనిపై గాలి పై వచ్చినంతనే /పాషాణమొకటికి స్పర్శ వచ్చె!
ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే / శిలకొక్క దానికిఁ జెవులుగలిగె!
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన /యశ్మంబు ఘ్రాణేంద్రియంబుఁజెందె!
ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబుఁ /గనవచ్చి ఱాతికిఁగనులుగలిగె!
ఆ ప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీక /రించినంత నుపల హృదయవీథి
నుపనిషద్వితాన మొలికి శ్రీరామభ /ద్రాభిరామమూర్తి యగుచుఁదోచె!” -
(బాలకాండ,అహల్యాఖండము)
రామాయణ కల్పవృక్షంలో అహల్యపాత్ర చాలా విశిష్టంగా కనిపిస్తుంది.గౌతమాశ్రమ ప్రాంతంలో రాముడు అడుగు పెట్టగానే ఆమె సాకారయై (శిలారూపం తొలగి)తన భర్తయైన గౌతమునితో కలిసి విశ్వామిత్రాదులకు ఆతిథ్యమిచ్చింది. గౌతముడు – “కన్నులఁబడి యాత్మయే యుఱుకునోయన ” రాముణ్ణి దర్శించాడు. ఇంకా మిథిలా నగరానికి వెళ్ళకముందే అహల్య రాముణ్ణి “జానకిరామా !” అని సంబోధిస్తుంది. “ప్రభుడైన రాముని శరీరం నుంచి వీచిన గాలిసోకినంతనే పాషాణానికి స్పర్శ,ఆయన కాలి సవ్వడి వినగానే చెవులు, ఆయన శరీరపరిమళం అనుభూతం కావటంతో ఘ్రాణేంద్రియం(వాసన), ఆయన నీలరత్నవిభాసిత శరీరాంగాలు కనిపించగానే చూపు వచ్చాయ”ని పరవశించి చెప్తూ - “ఆయన తన ఆతిథ్యం స్వీకరించగానే ఉపనిషత్ సమూహం రాతిగుండెలో చింది ఆయన సాక్షాత్తూకమలానాథుడని గ్రహించాను ” అంటుంది. సీతారామ కల్యాణఘట్టాన్ని ముందుగానే దివ్యదృష్టితో చూడజాలిన శక్తిసంపన్నురాలు.
రాముణ్ణి వదలలేక వదలుతూ ఆయన నుదుట తిలకం తీర్చిదిద్ది - “నాయనా !రామా! నువ్వు మిథిలకు వెళ్ళు. అక్కడ నా బిడ్డ శతానందుడుంటాడు. నువ్వూ నాబిడ్డవే అని , నా తండ్రివని, నా దైవానివని వాడికి చెప్పు. వైదేహిని వివాహమాడి, కల్యాణమూర్తులై మీ జంట తిరిగి వస్తూ గౌతమాశ్రమం మీదుగానే వెళ్ళాలి సుమా ! భక్తినే నూతన వస్త్రాలుగా నేసి మీకు కట్టఁబెట్టేందుకు ఒక దీనురాలు శిలయై మీకోసం ఇక్కడ ఎదురుచూస్తూ ఉంటుందని మరచిపోకు” అంటుంది. మిథిలలో అహల్యానందనుడైన శతానందునితో రాముడు – “నానుదుట విజయతిలకము దిద్దిన వారిద్దరే. అయోధ్యలో బయలుదేరినపుడు మా అమ్మ(కౌసల్య), అమ్మకన్నా ప్రేమగా గౌతమాశ్రమంలో అహల్య!” అని ఆనందంగా చెప్తాడు.
No comments:
Post a Comment