Thursday, December 15, 2011

విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో ...


 
1. తానో “లాములు” , “తండ్రి పేరెవరయా?” “దాచాదమాలాలు”- “నౌ
లే, నాపేర?”న “నమ్మగాల”నగ నోలిందల్లి - “కౌసల్య తం
డ్రీ !”నాగాననబోయి రాక కనులన్ నీర్వెట్టఁగౌసల్య “నౌఁ
గానే కానులె యమ్మనే!” యని ప్రభున్ గౌసల్య ముద్దాడినన్.




ఇది రామాయణ కల్పవృక్షంలో , బాలకాండ, అవతార ఖండంలోని పద్యం. బాలరామునకు అప్పడప్పుడే మాటలు వస్తున్న సందర్భం.కౌసల్యా, బాలరాముల సంభాషణం. పిల్లల వచ్చీ రాని మాటలు ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి.


కౌసల్య : (ఈ అబ్బాయి) తానెవరయ్యా?


రాముడు : లాములు (రాముడు)


కౌసల్య :మరి తండ్రి పేరెవరయ్యా?


రాముడు :దాచాద మాలాలు ( దశరథమహారాజు)


కౌసల్య : ఔనులే. మరి నాపేరు ..?


రాముడు : అమ్మగాలు .. (అమ్మగారు)


కౌసల్య : కాదు తండ్రీ ! నాపేరు..కౌసల్య


*బాలరాముడు “కౌసల్య” అనబోయాడు. కానీ ఆ పేరు పలకటం రాకపోవటంతో ఏడవటం ప్రారంభించాడు. అతడు ఆ పేరు చెప్పలేక కన్నీరు పెట్టటం కౌసల్య భరించలేకపోయింది. వెంటనే-


కౌసల్య : (సరే నాన్నా!) నేను కౌసల్యను కాదురా ! .. అమ్మనే! .. (“అలాగే అను”) అంటూ బాలరాముని ముద్దాడింది.


ఇది ఎంత మధుర సన్నివేశమోకదా.


1 comment:

  1. _/\_
    హృదయం ద్రవింపచేసి , కనులను ఆనందభాష్పాలతో నింపేసిన అందమైన, ఆనందమైన పద్యరాజము
    _/\_

    ReplyDelete